విద్యార్థులకు భోజనం.. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు

 విద్యార్థుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత - మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించిన సర్పంచ్ - ఉప సర్పంచ్

 

 ప్రజల కోరిక మేరకు 5వ వార్డులో ఉచిత BP, షుగర్ పరీక్షలు - ప్రజా ఆరోగ్యానికే పెద్దపీట!*


తల్లాడ, అక్టోబర్ 9, మన తెలుగు A న్యూస్:


తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ప్రజా సేవా కార్యక్రమాలు జోరుగా సాగాయి. సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు, ప్రజలకు సంబంధించిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నుండి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని పంచాయతీ పాలకవర్గం మరోసారి నిరూపించింది.


*జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన:*




ఉదయం తల్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. వంట గదిని, బియ్యం నిల్వలను, కూరగాయల నాణ్యతను కూడా తనిఖీ చేశారు.



అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి భోజనం ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి పెట్టగలరని అన్నారు. భోజన నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని, పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.


ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలో పరిశుభ్రత, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం పంచాయతీ బాధ్యత అని, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి పంచాయతీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


*5వ వార్డులో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం:*


అదే రోజు మధ్యాహ్నం, గ్రామసభలో ప్రజలు కోరిన మేరకు తల్లాడ 5వ వార్డులో సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. తల్లాడ PHC వైద్యాధికారి డా. ప్రత్యూష ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు ఉచితంగా రక్తపోటు (BP), మధుమేహం (షుగర్) పరీక్షలు చేసి అవగాహన కల్పించారు. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.



ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి శిబిరాలను ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు.



 ఈ కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు గుంటుపల్లి కుమారి, సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, నాయకులు జి.వి.ఆర్., ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు