శరన్నవరాత్రి ఉత్సవాలు - శివనగర్ దుర్గా మండపంలో అమ్మవారి ఆగమనానికి విశేష స్పందన


 పాల్వంచలో దసరా శోభ - శివనగర్ లో అమ్మవారి ఆగమనంలో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల 




 పాల్వంచ అక్టోబర్ 11 : ( మన తెలుగు A న్యూస్)

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ దుర్గా సేవా సమితి మరియు శివనగర్ యూత్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారి ఆగమన కార్యక్రమం శుక్రవారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.



ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను నిష్టతో కొలిచి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. నవరాత్రి ఉత్సవాలు కేవలం పండుగ మాత్రమే కాదని, సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందించే గొప్ప సాంప్రదాయమని కొనియాడారు. ఉత్సవ నిర్వాహకులు ఇదే స్ఫూర్తితో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.



అమ్మవారి ఆగమనం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు పట్టుకుని ఆధ్యాత్మిక శోభతో ఊరేగింపు నిర్వహించారు. డోలు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ శివనగర్ పరిసరాలు మార్మోగాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.



ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు సంతోష్ రెడ్డి అలియాస్ బబ్లు, శ్రీరామ్, సాయి, ప్రకాష్, గణేష్, బేతంశెట్టి విజయ్, చిన్నపండు, ఫణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.