*తల్లాడ జెడ్పీ పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం*.
పాత జ్ఞాపకాలతో, ఒక్కచోట చేరిన నాటి స్నేహితులు .
ఆనాటి అధ్యాపక గురువులకు జ్ఞాపికతో ఘన సన్మానం.
మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు.
తల్లాడ అక్టోబర్ 4, మన తెలుగు A న్యూస్
చదువుకున్న పాఠశాల తీర్చిదిద్దిన గురువులు బాల్యాన్ని పంచుకున్న స్నేహితులు కాలం ఎంత దూరం తీసుకెళ్లినా ఆ జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోలేదు.ఏళ్ల తర్వాత అదే పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న పూర్వ విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు.
తల్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం నాటి విద్యార్థుల సందడితో కళకళలాడింది. చదువుకునే రోజుల్లో జరిగిన సరదా సంఘటనలు, స్నేహబంధాలు, గురువుల బోధనలు, అప్పటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ముచ్చటించుకున్నారు.
తమ జీవితాలకు విద్యాబుద్ధులు నేర్పి, భవిష్యత్తుకు బాటలు వేసిన ఆనాటి అధ్యాపక గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువులకు జ్ఞాపికలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నో సంవత్సరాల తర్వాత తమ శిష్యులను ఒకే వేదికపై చూసిన గురువులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.
సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు తమ ప్రస్తుత పరిస్థితులు, కుటుంబ విషయాలు, జీవిత అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు.చిన్న నాటి స్నేహితులతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకుంటూ నవ్వులు పూయించారు.కాలం మారినా బాల్య స్నేహాలు చెక్కుచెదరలేదని ఈ సమ్మేళనం చాటి చెప్పింది. గురు,శిష్యుల అనుబంధానికి, స్నేహబంధాల మాధుర్యానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఆనాటి అధ్యాపక గురువులు కిషోర్ బాబు,వెంకటరమణ, నిర్మల జ్యోతి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసరావుతో పాటు 2002-03 బ్యాచ్కు చెందిన పలువురు పూర్వ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

0 కామెంట్లు
మీ అభిప్రాయాన్ని తెలపండి! 🙏
ఈ వార్తపై మీ కామెంట్ ఇక్కడ రాయండి - మన ఖమ్మం వార్తల కోసం!