ఖమ్మంలో టీటీడీ వెంకటేశ్వర ఆలయానికి భూమిపూజ - మంత్రి తుమ్మల, చిన్న జీయర్ స్వామి హాజరు

 ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ



ఖమ్మం: ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.



ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, సీపీ సునీల్ దత్  సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి  దయానంద్  హాజరయ్యారు. వేద మంత్రాల మధ్య హోమం నిర్వహించారు.



ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణం శుభపరిణామం అన్నారు. ఆలయాలు కేవలం పూజలకే కాకుండా ధర్మం, మానవత్వం, సహకారం వంటి విలువలను పెంపొందించే కేంద్రాలుగా ఉండాలని సూచించారు. భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.


మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఖమ్మంలో కూడా ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని తెలిపారు.


టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, ఖమ్మంలో ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల కృషి కీలకమని అన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో కొడంగల్ తర్వాత ఖమ్మంలో ఆలయానికి అనుమతి వచ్చిందని, కరీంనగర్‌లో త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఖమ్మంలో సుమారు 100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.



టీటీడీ జాయింట్ ఈవో ఎ. శరత్ మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.




ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు